Home అంతర్జాతీయం వార్నర్‌కు ‘సాండ్‌పేపర్‌’ సెగ

వార్నర్‌కు ‘సాండ్‌పేపర్‌’ సెగ

సాండ్‌ పేపర్‌.. గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏ స్థాయిలో కుదిపేసిందో అందరికీ తెలిసిందే. దీని కారణంగా అప్పటి సారథి స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొగా, ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టు సమతూకం దెబ్బతింది. కొత్త సారథిని వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోయారు. వరుస ఓటములు వెక్కిరించాయి. ఇలా ఒక్కటేమిటి అడ్డదారిలో గెలుపు కోసం చేసిన తప్పిదం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాను తలెత్తుకోకుండా చేసింది. 

సీన్‌ కట్‌ చేస్తే.. సంవత్సర నిషేధం పూర్తి చేసుకొని మళ్లీ వార్నర్‌, స్మిత్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రపంచకప్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వార్నర్‌ శతకాలతో చెలరేగగా.. స్మిత్‌ సమయోచిత పోరాటంతో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. ఇంకేముందీ.. వారిపై పడ్డ సాండ్‌పేపర్‌ మచ్చ తుడిచిపెట్టుకుపోయిందనుకున్నారంతా. కానీ యాషెస్‌ రూపంలో మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేసింది. నిషేధం పూర్తైన తర్వాత వార్నర్‌, స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌ కలిసి ఆడుతున్న తొలి టెస్టులోనే సాండ్‌పేపర్‌ సెగ తగిలింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మొదలైన తొలి టెస్టులో మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌ క్రికెటర్లు జాతీయగీతం ఆలపిస్తుండగా ఇంగ్లాండ్‌ అభిమానులు సాండ్‌పేపర్లు చూపిస్తూ హేళన చేశారు. ‘ఇంగ్లాండ్‌ ఛాంప్స్‌.. ఆసీస్‌ ఛీట్స్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల ప్రపంచకప్‌లోనూ వార్నర్‌, స్మిత్‌కు కొన్ని వేదికల్లో ఇలాంటి అవమానాలే ఎదురుకాగా.. ప్రతిష్ఠాత్మక యాషెస్‌లో ఆ వేడి ఇంకాస్త పెరిగింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి మైదానంలో చాలా మంది ఇంగ్లిష్‌ అభిమానులు ఇలా సాండ్‌పేపర్లు చేతబట్టి ఆసీస్‌ క్రికెటర్లను హేళన చేస్తూనే కనిపించారు.

వార్నర్‌ ఔటయ్యాక ఇంకాస్త పెరిగిన వేడి..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో ఓవర్‌లోనే స్టూవర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ (2) ఎల్బీగా వెనుదిరిగాడు. వార్నర్‌ పెవిలియన్‌కు చేరుతున్న సమయంలో ఇంగ్లాండ్‌ అభిమానులు మరింత రెచ్చిపోయారు. సాండ్‌పేపర్లు చూపిస్తూ స్టేడియం మొత్తం వినిపించేలా గట్టిగా కేకలు వేస్తూ అతణ్ని పెవిలియన్‌కు సాగనంపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాసేపటికే మరో ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్‌ (8) కూడా ఔటయ్యాక దాదాపు ఇదే పరిస్థితి. వికెట్‌ పడిన ప్రతిసారీ అభిమానులు ఇలానే సాండ్‌పేపర్లు చూపిస్తూ తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇంగ్లాండ్‌ బౌలర్లు కూడా వరుసగా వికెట్లు పడగొడుతూ అభిమానుల్ని మరింత ఉత్సాహపరిచారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టెయిలెండర్ల సహాయంతో పోరాడుతున్నాడు.