Home జాతీయం సింగ్‌ సోదరుల ఆస్తులపై ఈడీ దాడులు

సింగ్‌ సోదరుల ఆస్తులపై ఈడీ దాడులు

న్యూదిల్లీ: ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌ (సింగ్‌ సోదరులు) ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడుల చేపట్టింది. మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసిన అనంతరం ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. వ్యాపారాల్లో సింగ్‌ సోదరులు నష్టాలు చవిచూడడం, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.

రాన్‌బాక్సీ అమ్మకం వ్యవహారంలో సింగ్‌ సోదరులపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జపాన్‌కు చెందిన దైచీ సాంక్యో సంస్థ.. రాన్‌బాక్సీని 2008లో కొనుగోలు చేసింది. అప్పటికే రాన్‌బాక్సీ అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విచారణ ఎదుర్కొంటున్న విషయాన్ని వెల్లడించకపోవడంపై ఆ కంపెనీ సింగపూర్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో సింగ్‌ సోదరులు రూ.4వేల కోట్లు చెల్లించాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో దైచీ సాంక్యో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సదరు మొత్తం చెల్లించాలని, అందుకుగల ప్రణాళికను అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. గడువు అనంతరం సింగ్‌ సోదరులు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ధర్మాసనం.. బకాయి చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.