Home అంతర్జాతీయం సిద్ధార్థ మరణంపై సందేహాలెన్నో..

సిద్ధార్థ మరణంపై సందేహాలెన్నో..

తెలియని ఒత్తిడే కారణమా?
సేవాభావమూ నష్టాలబాట పట్టించిందా?

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కన్నడనాట నవ్య పారిశ్రామిక, వ్యాపారోన్నతికి బాటలు వేసిన వి.జి.సిద్ధార్థ ఆత్మహత్య ఉదంతం కార్పొరేట్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆయన బలవన్మరణం వార్త వినగానే వ్యాపారంలో నష్టాలేమోనన్న అభిప్రాయాలు తొలుత వ్యక్తమైనా.. ఆ వెంటనే అనేక అనుమానాలు మొదలయ్యాయి. కేఫ్‌ కాఫీ డే గత మార్చిలో వెల్లడించిన వార్షిక నివేదిక ప్రకారం సిద్ధార్థ పేరిట ఉన్నాయని చెబుతున్న అప్పులు రూ.6,500 కోట్లు. ఇందులో సిద్ధార్థకు చెందిన ఐటీ కంపెనీ ‘మైండ్‌ ట్రీ’ షేర్లను కూడా విక్రయించి అప్పుల్లో రూ.3 వేల కోట్లను తీర్చారు. ఇక మిగిలిన అప్పు రూ.3,500 కోట్లు. ప్రస్తుతం సిద్ధార్థ ఆస్తులు రూ.8,600 కోట్లు. అంటే ఆయన అప్పులన్నీ తీర్చినా ఇంకా రూ.5 వేల కోట్ల ఆస్తులున్నట్లే. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఆయన అప్పు అడిగితే ఇచ్చేవారికి కొదవే లేదు. కానీ ఆయన తన చావే అన్నింటికీ సమాధానం అని ఎందుకు తీర్మానించుకున్నారు? సిద్ధార్థ కనిపించకుండా పోయారని తెలిసిన క్షణంలోనే ఆయనపై ఏదో తెలియని ఒత్తిడి ఉందని రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు బహిరంగంగానే సందేహాలు వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. 
నష్టపోతానని తెలిసినా..
పదో తరగతి, డిగ్రీలు చదివి ఉపాధి లేని గ్రామీణ నిరుద్యోగులకు తన కంపెనీలో ఉపాధి కల్పిస్తే బాగుంటుందని భావించి ‘గ్రామ తరంగ్‌’ అనే సేవా కార్యక్రమానికి సిద్ధార్థ శ్రీకారం చుట్టారు. గ్రామాల నుంచి అతి తక్కువ విద్యార్హతతో వచ్చిన వారికి ఆంగ్ల భాషపై పట్టు, కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ నైపుణ్యం నేర్పించి మరీ ఉద్యోగాలు ఇప్పించారు. ఇలా శిక్షణ కోసం రూ.కోట్లు వ్యయం చేస్తే కష్టమని తోటివాళ్లు సలహా ఇచ్చినా పట్టించుకోలేదు. కాఫీ డేలో సాధారణ ఉద్యోగి జీతాన్ని, జీవితాన్ని మార్చేశారు. ఇక్కడే డిమాండ్‌, సరఫరా మధ్య సంబంధం తెగిపోయిందని, ఆయన సేవాభావం కూడా కాఫీ డే సంస్థల నష్టానికి ఓ కారణమైందని సిద్ధార్థ వ్యాపార జీవితాన్ని దగ్గరగా గమనిస్తున్నవారు అభిప్రాయపడుతుంటారు. చనిపోవడానికి మూడు రోజుల ముందు సిద్ధార్థ తన కంపెనీ సీఎఫ్‌ఓకు ఓ ఉత్తరం రాశారు. ఇందులో తానొక విఫల వ్యాపారినంటూ ప్రకటించుకున్న సిద్ధార్థ.. తనపై పెరుగుతున్న ఒత్తిడి గురించి కూడా ప్రస్తావించారు. ఈ ఒత్తిడి ఒక్క సిద్ధార్థకు మాత్రమే కాదని- ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ బాలకృష్ణన్‌, బయోకాన్‌ ఎండి కిరణ్‌ మజుందార్‌ వంటి వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్లుగా నిజాయతీగా వ్యాపారాలు చేయలేని పరిస్థితి మొదలైందని వీరి వాదన. ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌ తనపై ఒత్తిడి తెచ్చారని సిద్ధార్థ ప్రస్తావించడాన్ని నిగ్గు తేల్చాలని కిరణ్‌ మజుందార్‌ షా డిమాండ్‌ చేస్తుండగా- ట్యాక్స్‌ ఉగ్రవాదం వ్యాపారులను భీతిగొలుపుతోందని ఇండియా పెయిడ్‌ ప్రాజెక్ట్‌ సంస్థ వ్యవస్థాపకులు అనురాగ్‌ సక్సేనా ఆరోపించటం గమనార్హం. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, ఐదేళ్లుగా దేశంలో వ్యాపారాలు స్తంభించేందుకు ఇదే ఒత్తిడి కారణమని వ్యాపార రంగ దిగ్గజాలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలైతే మరో అడుగు ముందుకేసి దీన్ని రాజకీయ హత్యగానే భావించాల్సి వస్తుందంటూ ట్వీట్లు చేశారు. 


వ్యాపారంలో దిట్ట
కర్ణాటకలో లక్షలాది ఎకరాల్లో కాఫీ తోటలున్నా వీటిపై ఆధారపడిన వారి జీవితాలు మాత్రం మెరుగుపడలేదు. అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ గింజల ధర కిలో రూ.30 పలుకుతుంటే రైతులకు కాఫీ బోర్డు చెల్లించేది రూ.10 మాత్రమేనని, ఈ పరిస్థితిలో మార్పు రాదా అంటూ 1994లోనే సిద్ధార్థ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాఫీ రైతుల వాస్తవిక ఆదాయానికి అడ్డుగా ఉన్న చట్టాలను మార్చాలని పట్టుబట్టి మరీ రైతులే నేరుగా కాఫీ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే వెసులుబాటు కల్పించారు. అదే తెగువతో కర్ణాటకలో అమాల్గమేటెడ్‌ కాఫీ బీన్‌ను స్థాపించి ప్రపంచ ప్రఖ్యాత ‘స్టార్‌బక్స్‌’ సరసన తన సంస్థను నిలిపారు. 1,400కుపైగా దేశ విదేశీ కాఫీ డే శాఖల్లో 50 వేల మందికి ఉపాధి కల్పించారు. ‘మైండ్‌ ట్రీ’ పేరిట ఐటీ సంస్థనూ ఆరంభించారు. ఇన్ఫోసిస్‌ సంస్థపై అంతగా గురి లేని రోజుల్లోనే అతి తక్కువ ధర (ఒక్కోటి రూ.95)కు షేర్లు కొని ఐదింతల లాభానికి విక్రయించారు. 
కాఫీయే కాదు.. ఇంకా చాలా!
‘కాఫీతో పాటు ఇంకా చాలా జరగొచ్చు’ అన్నది కాఫీడే నినాదం. దానికి తగ్గట్టుగానే అక్కడ కేవలం కాఫీయే కాక.. ఇంకా చాలా దొరుకుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వర్తమాన సమస్యల దగ్గర్నుంచి, భవిష్యత్తు ప్రణాళికల వరకు చర్చలకు వేదికగా యువత మెచ్చే చోటది. టీ, కాఫీ, సమోసాతో పాటు.. ఇంకా బ్రౌనీస్‌, స్మూతీస్‌, స్లషెస్‌, బిర్యానీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌.. ఇలా యువత మెచ్చేవి అక్కడ చాలా దొరుకుతాయి. 25 ఏళ్లలోపు వయసున్న భారతీయుల్లో 40% మంది ఆహ్లాదంగా గడిపేందుకు దాన్నే ఎంచుకుంటున్నారు. 

చిన్ననాటి స్నేహితులను కలవాలన్నా, కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఏదైనా ప్రాజెక్టు గురించి నెట్‌లో వెతకాలన్నా, అమ్మా నాన్నలను తీసుకెళ్లి వాళ్లకి మంచి బిర్యానీ పెట్టించాలన్నా, పెళ్లిచూపుల తర్వాత అమ్మాయితో వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా.. నేటి సాఫ్ట్‌వేర్‌ తరానికి వెంటనే గుర్తుకొచ్చే స్థలం కాఫీడేనే. ఒకప్పుడు కేవలం టీ మాత్రమే తాగే భారతీయ యువతను రూ. 150 వెచ్చించి కప్పు కాఫీ తాగే స్థాయికి తీసుకొచ్చినది కచ్చితంగా సీసీడీనే. స్టార్‌బక్స్‌ లాంటి బహుళజాతి కాఫీ ఔట్‌లెట్లు రావడానికి చాలా ముందే ఇది మన దేశంలో ప్రారంభమైంది. సాధారణ హోటళ్లలో 10-15 రూపాయలు పెడితే వచ్చే కాఫీ, లేదా ఇతర స్నాక్స్‌ కోసం అంత మొత్తం వెచ్చించాలా అంటే, అక్కడుండే వాతావరణమే అందుకు సమాధానం చెబుతుంది. లోపలకు వెళ్లగానే చల్లగా తగిలే ఏసీ గాలి, కావల్సినంత సేపు ఇంటర్‌నెట్‌ వాడుకునే సదుపాయం, మెత్తటి కుర్చీలు, ఇద్దరి నుంచి పది పన్నెండు మంది వరకు కూర్చోగలిగే అవకాశం, గోడల మీద కూడా ఆహ్లాదకరమైన బొమ్మలు.. ఇవన్నీ ఉండటంతో యువత వెంటనే వాటికి ఆకర్షితులవుతున్నారు.
కళ్ల ముందు అద్భుతం 
అంతర్జాతీయంగా స్టార్‌బక్స్‌ ఏం చేసిందో భారతదేశంలో కేఫ్‌ కాఫీడే అదే చేసిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు చెప్పారు. బెంగళూరు బ్రిగేడ్‌ రోడ్డులో 1996లో ఒక్క కేఫ్‌తో మొదలైన ఈ ఔట్‌లెట్లు ఇపుడు దేశవ్యాప్తంగా 243 నగరాల్లో 1,843 కేఫెలతో పాటు ఆరు దేశాల్లో కూడా విస్తరించాయి. కాఫీని అన్ని రకాలుగా చేయొచ్చని తనకు అక్కడకు వెళ్లాకే తొలిసారి తెలిసిందని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చెప్పారు. అప్పటివరకు సినిమాల్లో మాత్రమే చూసిన వాతావరణాన్ని తొలిసారి కళ్లెదుట చూసినపుడు ఆ అద్భుతం వల్ల తనకు నోట మాట రాలేదని, అప్పటికప్పుడే కాఫీడేతో ప్రేమలో పడిపోయానని ముంబయికి చెందిన కన్సల్టెంటు అన్నారు. కాఫీడేలో దొరికే హాట్‌ చాక్లెట్‌ అంటే తాను పడిచస్తానన్నది హైదరాబాదీ బీటెక్‌ విద్యార్థి అభిప్రాయం. తన అన్నకు ఉద్యోగం వచ్చినపుడు తొలి జీతంతో కాఫీడేలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడని, దానికి తననూ తీసుకెళ్లగా ఇంటర్మీడియట్‌ నుంచే తాను ఆ మధుర స్మృతులను ఆస్వాదించగలిగానని మరో యువకుడు చెప్పాడు. ఇంతమందిని ప్రభావితం చేసిన వీజీ సిద్ధార్థ చనిపోయారంటే యువత జీర్ణించుకోలేకపోతోంది.

సిద్ధార్థ మరణం వెనుక అదృశ్య శక్తులు: దేవేగౌడ 
కాఫీడే యజమాని సిద్ధార్థ మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించాలని మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ సూచించారు. సిద్థార్థ మృతి కర్ణాటకకే కాదు.. దేశానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. వేల మందికి ఉపాధి చూపిన సిద్ధార్థతో తనకు 33 సంవత్సరాలుగా పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మశక్యంగా లేదన్నారు. వేధింపులే కారణం: మమత 
పలు సంస్థల నుంచి ఎదురైన వేధింపుల వల్లే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణించారని, చాలామంది పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లిపోవాలనే ఒత్తిడిలో ఉన్నారని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయన మరణం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  
నమ్మలేక పోతున్నా 
కాఫీడే సిద్ధార్థ.. కర్ణాటక ఆస్తి. ఆయన మృతి చెందారంటే నమ్మలేకపోతున్నానని మాజీ మంత్రి డీకే శివకుమార్‌ (కాంగ్రెస్‌) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేలమంది కన్నడిగులకు ఉద్యోగాలిచ్చి, అందరినీ తనవారిగా చూసుకున్నారన్నారు.  
విచారణ జరిపించాల్సిందే 
సిద్ధార్థ మృతి వెనక అదృశ్య హస్తాలున్నాయనే సందేహాలపై విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. ఆయనను పలువురు వేధించారనే అంశం సిద్ధార్థ లేఖ ఆధారంగా గుర్తించవచ్చన్నారు.
కన్నీరు మున్నీరైన కార్మికులున్యూస్‌టుడే యంత్రాంగం: చిక్కమగళూరు జిల్లా మూడబిద్రి సమీపంలోని చేతనహళ్లిలోని తోటలో ‘కాఫీˆ కింగ్‌’ సిద్ధార్థ భౌతికకాయానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగిసే సమయానికి.. కట్టలు తెగిన శోకసంద్రాలు ఎన్నో! ఆయన ఇద్దరి కుమారులూ ఏకకాలంలో చితికి నిప్పంటించే వేళ అక్కడి వారి వేదన వర్ణనాతీతం. సిద్ధార్థ కన్నడిగులకు ఉద్యోగాలు ఇప్పిస్తూ, వారిని విదేశాలకు పంపి సత్తా చాటుకునే అవకాశాలను సృష్టించి- కార్మిక లోకానికి ప్రత్యక్ష దైవంగా మారారు. అలాంటి వ్యక్తి అనుమానాస్పద రీతిలో బలవన్మరణానికి పాల్పడటంతో కాఫీˆ డేలో పని చేస్తున్న 30 వేల మందితో పాటు, ఆయన 12 వేల ఎకరాల కాఫీ తోటల్లోని పాతిక వేల మంది కార్మికులు తాము ఒంటరి వాళ్లమయ్యామంటూ విలపించారు.