Home ఆంధ్ర ప్రదేశ్ సీఎంల భేటీ.. నదీ జలాల తరలింపుపై చర్చ

సీఎంల భేటీ.. నదీ జలాల తరలింపుపై చర్చ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశం ముగిసింది. గోదావరి జలాల మళ్లింపు, రాష్ట్ర విభజన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన సమాలోచనల్లో ప్రధానంగా గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించడంపై చర్చ జరిగినట్టు సమాచారం. గత జూన్‌ 28న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు కొన్ని ప్రతిపాదనలు తయారు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో వాటన్నింటిపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

గోదావరి జలాలు ఎక్కడి నుంచి తరలిస్తే మంచిది? నీటిని ఏ ప్రాంతానికి ఎలా తీసుకొస్తే వ్యయం తక్కువగా ఉంటుంది? నీరు సునాయాసంగా ఎలా చేరుతుందనే అంశంపై ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ మధ్య విభజన చట్టంలో కొన్ని సమస్యలకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. ఏ అంశానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానితో పాటు పరిష్కారం కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపైనా చర్చించినట్టు సమాచారం. దిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల పంపకం సహా విద్యుత్‌ బకాయిలు, 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన తదితర అంశాలపైనా సీఎంల భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈనెల 8న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన అంశాలపై సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎంలు చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్టు సమాచారం. సీఎంలతో పాటు ఈ సమావేశంలో తెలంగాణ నుంచి వినోద్‌, సంతోష్‌, ఏపీ నుంచి మిథున్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.