Home Uncategorized ఉగ్రవాదం పోవాలంటే 370 రద్దు తప్పనిసరి: షా

ఉగ్రవాదం పోవాలంటే 370 రద్దు తప్పనిసరి: షా

కశ్మీర్‌ యువతకు మంచి భవిష్యత్‌ ఇవ్వడమే మా లక్ష్యం

దిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదం పారదోలాలంటే ఆర్టికల్‌ 370 రద్దు తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కశ్మీర్‌ యువతకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన రిజర్వేషన్లు, తదితర బిల్లులపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

‘‘దీర్ఘకాలం రక్తపాతానికి కారణమైన 370 అధికరణం పరిసమాప్తమైంది. జనసంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీని గుర్తుచేసుకోవాల్సిన క్షణాలివి. 370 అధికరణంపై ఎలాంటి పరిణామాలు వస్తాయో ఆనాడే ఆయన చెప్పారు. కొంతమంది మాత్రం నిజాలు దాచిపెట్టారు. 370 రద్దు చేస్తే ప్రపంచమే మునుగుతుందన్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. పాక్‌ నుంచి వచ్చిన శరణార్థులకు దేశవ్యాప్తంగా ఓటు హక్కు వచ్చింది. ఆ శరణార్థులకు జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఓటు హక్కు రాలేదు. పాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రధానులు అయ్యారు. సరైన విద్యావకాశాలు లేక కశ్మీర్‌ యువత వెనుకబడి ఉంది. స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చిన 73, 74 సవరణలు కశ్మీర్‌లో అమలు కాలేదు.

వేర్పాటువాదుల పిల్లలెక్కడున్నారు?
‘‘పాక్‌ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు కశ్మీరీ యువత బలైంది. ఉగ్రవాదమనే విష వృక్షాన్ని పెకిలించేందుకు కశ్మీర్‌లో పరివర్తన ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దుతోనే ఇది సాధ్యం. ఈ ఆర్టికల్‌ ఉన్నంత వరకు కశ్మీరీ యువత భారత్‌లో కలవదని జియావుల్‌హక్‌ ఆనాడే చెప్పారు. పాక్‌ ప్రేరేపిత వేర్పాటు వాదుల వల్లే ఈ సమస్యంతా. వేర్పాటు వాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లండ్‌లో చదువుకుంటారు. 370 ఆర్టికల్‌ కోసం పట్టుబట్టేవారి పిల్లలు ఎక్కడున్నారో ఓ సారి గుర్తు చేసుకోండి. జమ్మూ కశ్మీర్‌ యువతకు మంచి భవిష్యత్‌ అందించాలని అనుకుంటున్నాం. కశ్మీర్‌లో ఉగ్రవాదులు పోవాలంటే ఆర్టికల్‌ 370 రద్దు తప్పదు’’ అని అమిత్‌షా వివరించారు.

హడావుడి నిర్ణయం కాదు..
‘‘1950 తర్వాత మా పార్టీ ప్రతి మేనిఫెస్టోలో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామన్నాం. హడావిడి, అకస్మాత్తు నిర్ణయమని వాదించేవాళ్లు ఈ విషయం గమనించాలి. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ 370 ఆర్టికల్‌ను కదిపే సాహసం చేయలేదు. ఒక తాత్కాలిక అధికరణను ఇలా ఎన్నాళ్లు కొనసాగిస్తారు? పటేల్‌ విలీనం చేసిన సంస్థానాలన్నీ ఇవాళ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ సంస్థానాల్లో ఎక్కడా 370 అధికరణలు అమల్లో లేవు. ఆర్టికల్‌ 370 వల్లే కశ్మీర్‌ విలీనం జరిగిందన్న వాదన సరికాదు. దానిలో ఎలాంటి వాస్తవం లేదు. 370 లేకుంటే భారత్‌ నుంచి జమ్ముకశ్మీర్‌ విడిపోతుందని కొందరు అంటున్నారు. అందులోనూ ఏమాత్రం నిజం లేదు.’’

అప్పటి వరకు కేంద్రపాలిత ప్రాంతంగానే..
‘‘దేశం గురించి నిర్ణయాలు తీసుకోవాలంటే సాహసం కావాలి. దేశ సమగ్రత కోసం రాజకీయాల పరిధిని దాటే ధైర్యం కావాలి. మన ప్రధానికి ఆ ధైర్యం ఉంది. ఆర్టికల్‌ 370 రద్దుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అవసరమైతే రాజకీయ విధి విధానాలను సభ ముందుంచుతాం. జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా ఎన్నాళ్లు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో అప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. రానున్న ఐదేళ్లలో కశ్మీర్‌ యువతలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. జమ్ముకశ్మీర్‌ సమస్యకు ఇదే అంతిమ పరిష్కారమా అని ప్రశ్నిస్తు్న్నారు. ఏం చేసేందుకైనా అధికరణం 370 రద్దు తప్పనిసరి. ఓటు బ్యాంకు రాజకీయాలు పక్కనపెట్టి సభ్యులంతా కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మద్దతివ్వాలి’’ అని హోంమంత్రి అమిత్‌షా కోరారు.