Home Uncategorized అయోధ్య రాముడి జన్మస్థానమన్నది విశ్వాసం

అయోధ్య రాముడి జన్మస్థానమన్నది విశ్వాసం

దిల్లీ: అయోధ్య శ్రీరాముడి జన్మస్థానమని, ప్రస్తుతం వివాదాస్పదమైన స్థలంలోని నిర్మాణంలోనే జన్మించాడన్నది హిందువుల ప్రగాఢ విశ్వాసమని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ సంస్థ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయని, కోర్టు ఇంతకు మించి హేతుబద్ధతను చూడాల్సిన అవసరం లేదన్నారు. 1608-11 సంవత్సరాల మధ్య ఆంగ్లేయ వ్యాపారి విలియం ఫిన్చ్‌ తన పర్యటనావిశేషాలను వివరిస్తూ రాసిన పుస్తకంలో అయోధ్యలో కోట ఉందని అక్కడ శ్రీరాముడు జన్మించినట్లు ప్రజలు విశ్వసిస్తారని రాశారని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కలగజేసుకొని బాబ్రీమసీదు అని మొదటగా ఎప్పుడు పిలిచారని, బాబర్‌నామాలో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. 19వ శతాబ్దంలోనే బాబ్రీమసీద్‌ అని పిలిచినట్లుగా ఉందని అంతకుముందు ఎలాంటి ప్రస్తావనా లేదని వైద్యనాథన్‌ సమాధానమిచ్చారు. బాబర్‌నామాలో ఏ విషయమూ లేదని, బాబర్‌ అక్కడి కట్టడాన్ని కూల్చివేయమని తన సేనాధిపతిని ఆదేశించారని వివరించారు. దీనిపై ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ అభ్యంతరం చెబుతూ బాబర్‌నామాలో ఈ విషయం ప్రస్తావించలేదనడం సరికాదన్నారు. బాబర్‌ అయోధ్యకు వెళ్లేందుకు నదిని కూడా దాటినట్లు ఉందని చెప్పారు.