Home Uncategorized గుడ్డు పెంకు… ఎముకను అతుకు

గుడ్డు పెంకు… ఎముకను అతుకు

సహజ వ్యర్థాల నుంచి బీటా-టీసీపీ తయారీ 

ఐఐటీ హైదరాబాద్‌, ఎన్‌ఐటీ జలంధర్‌ పరిశోధకుల ఘనత

ఈనాడు, సంగారెడ్డి: ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి గొప్ప ఊరటనిచ్చే పరిశోధన ఇది. అతికించేందుకు వాడే బీటా-ట్రైకాల్షియం ఫాస్పేట్‌ (బీటా-టీసీపీ)ను గుడ్డు పెంకుల నుంచి తయారు చేయవచ్చని ఐఐటీ హైదరాబాద్‌, ఎన్‌ఐటీ జలంధర్‌కు చెందిన పరిశోధకులు నిరూపించారు. ఐఐటీ హైదరాబాద్‌లోని బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న పరిశోధక విద్యార్థి రూపావత్‌ ఉదయ్‌ కిరణ్‌, ఆచార్యులు సుభా నారాయణ్‌రథ్‌, భరత్‌ పి.పాణిగ్రాని, ఎన్‌ఐటీ జలంధర్‌కు చెందిన ఆచార్యుడు మహేష్‌ కుమార్‌లు ఈ పరిశోధనలో భాగస్వామ్యులయ్యారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదలైంది. ఎముకలను అతికించేందుకు ప్రస్తుతం వాడే వాటిల్లో ఎక్కువగా లోహాలు, రసాయనాలే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో గుడ్డు పెంకు నుంచి ఎముకలను అతికించేందుకు అవసరమైన బీటా-టీసీపీని బాల్‌ మిల్లింగ్‌ పద్ధతి ద్వారా సేకరించవచ్చని పరిశోధకులు నిరూపించారు. ఈ పౌడర్‌తో ఎముకకు ప్రత్యామ్నాయాన్ని తయారుచేసి బాధితులకు సాంత్వన చేకూర్చవచ్చని పరిశోధక విద్యార్థి రూపావత్‌ ఉదయ్‌కిరణ్‌ స్పష్టం చేశారు. తమ పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చాయని, రానున్న రోజుల్లో వాణిజ్య పరంగానూ దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఖర్చూ తగ్గుతుందన్నారు. బాధితుల అవసరాలకు తగినట్లుగా ప్రత్యామ్నాయ ఎముకను తయారు చేయవచ్చని త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా కావాల్సిన ఆకృతిలో వాటిని రూపొందించవచ్చని వివరించారు.