Home Uncategorized తపాలాశాఖలో రూ.5 కోట్ల అవినీతి

తపాలాశాఖలో రూ.5 కోట్ల అవినీతి

అనంతపురం (అరవిందనగర్‌), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రి బజారు పోస్టాఫీసులో ఉద్యోగి.. పోస్టుమాస్టరు చెన్నరాముడు ఖాతాదారుల పొదుపు సొమ్ము రూ.5 కోట్లను  సొంతానికి వాడుకున్నట్లు దర్యాప్తు బృందం తేల్చింది. ఇటీవల ఓ ఖాతాదారుడు తన పొదుపు ఖాతాలో సొమ్ము లేకపోవడంతో ఫిర్యాదు చేశాడు. దీనితో అన్ని పొదుపు ఖాతాలను తనిఖీ చేయగా, రూ.5 కోట్లు సొమ్ము స్వాహా అయినట్లు తేలిందని అనంతపురం తపాలా డివిజన్‌ ఎస్పీ ఆదినారాయణ బుధవారం వెల్లడించారు. పోస్టాఫీసులో 6 వేల ఖాతాలుండగా బుధవారం నాటికి 4 వేల ఖాతాలకు సంబంధించి తనిఖీ పూర్తయినట్లు చెప్పారు. తపాలా శాఖలో రూ.50 లక్షలకు మించి అవినీతి జరిగితే, ఆ కేసులను సీబీఐకి అప్పగించాలనే నిబంధన ఉంది. ఈ మేరకు సీబీఐకు¸ కేసును  అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ బాగోతం వెలుగు చూడగానే పోస్టుమాస్టరు కుటుంబంతో పరారయ్యాడని,  అతని ఆచూకీ తెలిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.

ఆన్‌లైన్‌ వ్యవస్థఉన్నా…
తపాలాశాఖలో అక్రమాలు జరగకుండా ఆన్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది. బ్యాంకులో ఖాతాదారులు తమ ఖాతా నుంచి నగదు తీసుకున్నప్పుడు, జమ చేసిన సమయంలో ఆ సమాచారం ఖాతాదారుకు సంక్షిప్త సందేశం అందే వ్యవస్థ ఉంది. మొబైల్‌ నంబరు మార్చటానికి పోస్టుమాస్టరుకు అధికారం ఇచ్చారు.కొన్ని ఖాతాలకు నెంబర్లతో అనుసంధానం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పోస్టుమాస్టరు చెన్నరాముడు 2016 నుంచి క్రమంగా నగదు తీసుకున్నట్లు తెలిసింది. ఖాతాదారుల పొదుపు సొమ్ము సుమారుగా రూ.9 కోట్లు తన ఖాతాలోకి మళ్లించి, అందులో రూ.5 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు.