Home Uncategorized ప్రసవానికి వస్తే ప్రాణాలు పోయాయి!

ప్రసవానికి వస్తే ప్రాణాలు పోయాయి!

తల్లీబిడ్డ మృతికి వైద్యులే కారణమని ఆందోళనకు దిగిన గ్రామస్థులు

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారంటూ బంధువులు, గ్రామస్థులు రహదారిపై 3 గంటల పాటు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం సవర బాణాపురం గ్రామానికి చెందిన గర్భిణి సవర కృష్ణవేణి(24)ని ప్రసవం కోసం చాపర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి మంగళవారం తీసుకొచ్చారు. ప్రసవానికి సమయం ఉందని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 2గంటల సమయంలో కృష్ణవేణి పరిస్థితి విషమించినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తొలి కాన్పు కావడంతో  ఉమ్మనీరు రక్తంలో కలిసిపోయి గుండె స్తంభించడంతో కృష్ణవేణి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీసినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇద్దరి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం ఉదయం మృతదేహాలతో పర్లాఖెముండి-పూండి రహదారిలో 3 గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల చొరవతో చివరికి ఆందోళన విరమించారు.