Home Uncategorized యువతి కిడ్నాప్‌.. ‘కథ’ సుఖాంతం!

యువతి కిడ్నాప్‌.. ‘కథ’ సుఖాంతం!

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే:  ‘హాస్టల్‌ నుంచి స్టేషనరీ కొనేందుకు వెళ్తే.. నన్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అంబులెన్సులో మీ వారు ఉన్నారట..పిలుస్తున్నారని ఓ వ్యక్తి చెబితే వెళ్లాను. అందులో ఉన్న ఓ వ్యక్తి లోపలికి లాక్కున్నాడు. మరొకరు ముఖంపై స్ప్రే కొట్టారు. ఆ తర్వాత రాత్రి స్పృహ వచ్చి చూస్తే ఓ గదిలో ఉన్నట్లు గమనించాను.  సమీపంలో ఎవరూ లేకపోవడంతో గది నుంచి బయటికి వచ్చాను.  రోడ్డుపై ఆటో ఆపగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి లింగంపల్లిలోని బంధువుల ఇంటికెళతామని ఎంఎంటీఎస్‌ ఎక్కితే అది ఫలక్‌నుమా వెళ్తోంది. దీంతో కాచిగూడలో దిగాను. అక్కడ రేపల్లె రైలు ఎక్కి గుంటూరులోని మా ఇంటికి వెళ్లాను.’ ..పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓ యువతి కథనం ఇది. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు మంగళవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు కలకలం సృష్టించింది. పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి విచారణలో ఏం తేలింది? వాస్తవమేమిటన్నది ఆసక్తికరం.

ఆరా తీసిన పోలీసులు.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. యువతిని వెంట తీసుకెళ్లి వెళ్లి ఆమె ఉండే హాస్టల్‌, ఆమె వెళ్లిన స్టేషనరీ, అంబులెన్సు ఆగిఉన్న స్థలం తదితరాలు తెలుసుకున్నారు. ఆయా మార్గాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ యువతి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లినట్టు.. స్టేషనరీ ముందు నుంచి వెళ్లినట్లు అందులో గమనించారు. రాజ్‌భవన్‌ రోడ్డు గుండా మోనప్ప సర్కిల్‌ (రాజీవ్‌ సర్కిల్‌) మీదుగా నేరుగా బేగంపేట మెట్రోస్టేషన్‌ దాకా ఫోన్‌లో మాట్లాడుతూ నడిచి వెళుతున్నట్లు గుర్తించారు. దీంతో కిడ్నాప్‌ కాలేదమో అన్న అనుమానం పోలీసులకు కలిగింది. ఆమె ఫోన్‌లో ఎవరితో మాట్లాడిందో ఆరా తీయగా.. తన తండ్రితోనే అని తేలింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయట పడింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి (18) పంజాగుట్టÅలోని ఓ మహిళా కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. సోమాజిగూడలోని హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల నాలుగు రోజులు సెలవులు ఉండటంతో లింగంపల్లిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. 12న (సోమవారం) సాయంత్రం హాస్టల్‌కు తిరిగి చేరుకుంది. హైదరాబాద్‌లో తాను చదువుతున్న కళాశాలలో ఇమడలేక అభద్రతా భావానికి లోనవుతున్న ఆమె అదే రోజు గుంటూరులోని తన ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ తన తల్లిదండ్రులకు కిడ్నాప్‌ కథ చెప్పింది. వారు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతి తెలిసీ తెలియక కిడ్నాప్‌ కథ చెప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ వారు విచారిస్తున్నారు.