ఈనాడు, హైదరాబాద్: భారతీ ఎయిర్టెల్ కంపెనీ అధికారినంటూ చెప్పుకొని ఆకర్షణీయ సిమ్‌కార్డు నంబర్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్, థానే కేంద్రాలుగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తోందని, సనద్ అనే యువకుడు నాయకత్వం వహిస్తున్నాడని సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కె.సి.ఎస్ రఘువీర్ తెలిపారు. ఆకర్షణీయమైన శ్రేణుల నంబర్లు తాము కేటాయిస్తామని, రుసుం చెల్లించాలంటూ ప్రధాన నిందితుడు సనద్ చరవాణులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నాడని వివరించారు. ఆకర్షణీయ నంబర్లు ఇస్తానంటూ సురేందర్ సింగ్ అనే యువకుడి నుంచి రూ.3.25లక్షలు వసూలు చేసుకున్నారన్నారు. సిమ్‌కార్డులు పంపకపోవడంతో బాధితుడి ఫిర్యాదుతో కొద్దిరోజుల క్రితం కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించగా.. నాసిక్‌లో నిందితులున్నట్టు గుర్తించామని తెలిపారు. ఇన్స్పెక్టర్ మధుసూదన్ బృందం రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి బుధవారం తెల్లవారుజామున సనద్‌తో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుందన్నారు. వారిని హైదరాబాద్‌కు తరలించి కోర్టులో హాజరు పరిచాక జైలుకు పంపించామని తెలిపారు.