Home Uncategorized సాగు నష్టాలతో ఇద్దరు రైతుల బలవన్మరణం

సాగు నష్టాలతో ఇద్దరు రైతుల బలవన్మరణం

ఇంకొల్లు, గిద్దలూరు పట్టణం-న్యూస్‌టుడే: అప్పులు పెరిగి వాటిని తీర్చే దారి కానరాక రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన వెంకటరవి (35) ఏడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. నష్టాలు రావడంతో సొంత భూములు అమ్మి అప్పులు తీర్చారు. నాలుగేళ్లుగా కౌలుకు భూమి తీసుకుని సాగు చేస్తున్నారు. మళ్లీ నష్టాలే రావడంతో… ఇటీవలే ఆయన ట్రాక్టరును అప్పుల వారు తీసుకుపోయారు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ ఏడాది కొంత భూమి కౌలుకు తీసుకున్నారు. సేద్యానికి చేతిలో డబ్బులేక… తీవ్ర మనస్తాపంతో బుధవారం వేకువజామున పురుగుమందు తాగారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి, దివ్యాంగ సోదరి ఉన్నారు.

* గిద్దలూరు మండలం కొంగళవీడుకు చెందిన ఉలాపు కృష్ణ అలియాస్‌ కృష్ణమూర్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వ్యవసాయం చేస్తున్నారు. కొన్నేళ్లుగా సేద్యంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. రుణదాతల ఒత్తిడి పెరగడం, అప్పు తీర్చే దారి కానరాకపోవడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.