Home Uncategorized సెల్ఫీ సరదా ప్రాణం తీసింది..

సెల్ఫీ సరదా ప్రాణం తీసింది..

భోపాల్‌: సెల్ఫీ సరదా తల్లీకూతుళ్ల ప్రాణం తీసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రజలు అక్కడికి వెళ్లి ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తల్లీ, కూతురు వరద కాలువ పక్కన సెల్ఫీ తీసుకోబోయి నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మండ్‌సార్‌ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్‌డీ గుప్తా బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని వరద కాలువను చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అతడి భార్య బిందు గుప్తా(48), అశ్రితి(21) కాలువ వద్ద సెల్ఫీ దిగబోయారు. కాలువలో వరద ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో వారు నిల్చున్న కల్వర్టు కూలింది. ఈ ప్రమాదంలో బిందు, అశ్రిత వరద నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 

మరోవైపు మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 39 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జిల్లాలోని హైదర్వాస్‌ తదితర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 3 వేల మంది నిరాశ్రయులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మాండ్‌సార్‌ జిల్లా ఎస్పీ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రధాన నదులైన నర్మదా, బెత్వా, తపతి, తవా, చంబల్‌, పార్వతి నదులు పొంగి పొర్లుతున్నాయి.