Home Uncategorized 24 ఏళ్ల అనుబంధం.. మళ్లీ కలిసింది..!

24 ఏళ్ల అనుబంధం.. మళ్లీ కలిసింది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి ఒక్కరికీ చిన్నతనంలో జరిగిన విషయాలు కొన్ని తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడూ నెమరువేసుకుని మురిసిపోతుంటారు. పెరిగి పెద్దయ్యాక ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఆనందానికి కారణమైన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? అని తెలుసుకుని కలిసే ప్రయత్నం చేసే వాళ్లు చాలా అరుదు. కానీ లండన్‌కు చెందిన ఒక యువతి చిన్నప్పుడు తనకు ఆడుకోడానికి సైకిల్‌ కొనిచ్చి ఆనందానికి గురిచేసిన వ్యక్తిని కలుసుకునే ప్రయత్నం చేసి విజయం సాధించింది.
వివరాల్లోకి వెళ్తే.. మెవాన్‌ బబ్బకర్‌ (29) ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. కుర్దిష్‌కు చెందిన మెవాన్‌ కుటుంబం 1994-1995లో గల్ఫ్‌ యుద్ధ సమయంలో ఇరాక్‌ వదిలి నెదర్లాండ్‌లోని ఒక శరణార్థి శిబిరానికి చేరి అక్కడ తలదాచుకున్నారు. అప్పుడు మెవాన్‌ వయసు ఐదేళ్లు. ఆ సమయంలో అక్కడ శిబిరం వద్ద పనిచేసే ఒక వ్యక్తి తనకు చిన్న సైకిల్‌ కొనిచ్చి ఎంతో ఆనందానికి గురిచేశారు. ఆ తర్వాత వారు ఆ ప్రదేశాన్ని వదిలి లండన్‌కు వెళ్లిపోయారు.

ఆ సంఘటనను గుర్తుపెట్టుకున్న ఆమె 24ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి కలవాలని సంకల్పించింది. కానీ అతడి పేరు కూడా ఆమెకు తెలియదు. కేవలం చిన్నతనంలో ఆ వ్యక్తితో దిగిన ఒక ఫొటో మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆమె సోమవారం ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ట్వీట్‌లో ఆమె పేర్కొంటూ..‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నపుడు మా కుటుంబం నెదర్లాండ్‌లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నాం. ఆ సమయంలో జ్వోల్లే ప్రాంతంలో పనిచేసే ఒక వ్యక్తి నాకు సైకిల్‌ కొనిచ్చి ఆనందపరిచాడు. ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు. నేను అతడిని కలుసుకోవాలనుకుంటున్నాను’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఆ పోస్ట్‌ను నెటిజన్లు కొద్ది గంటల్లోనే 7వేల సార్లు రీట్వీట్‌ చేశారు. అతడిని కనుగొనడంలో ఆ ట్వీట్‌ ఆమెకు ఎంతో ఉపయోగపడింది. తాజాగా మంగళవారం ఆమె అతడిని కలుసుకుని మళ్లీ ట్విటర్‌లో పోస్ట్‌చేసింది. ‘ఈ వ్యక్తి వ్యక్తి పేరు ఎగ్బర్ట్‌. 1990 నుంచి శరణార్థులకు సహాయం చేస్తున్నారు. ఆయనను చూడగానే ఎంతో ఆనందం కలిగింది. నేను ఎంతో ధైర్యవంతమైన మహిళగా ఎదిగినందుకు ఆయన ఎంతో గర్వించారు. వారికి ఒక మంచి కుటుంబం ఉంది. ఇక నేను వారిని విడిచిపెట్టలేనని ఆ కుటుంబం భావిస్తుస్తోంది. చిన్న పనులు గొప్ప అనుభవాల్ని మిగిల్చాయి’ అంటూ ఆమె పోస్ట్‌లో వెల్లడించారు. ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.