- తెలుగు భాషను నిషేధిస్తే భాషాసంఘం ఏం చేస్తోంది?
- తెలుగు విలువ వైసీపీకి తెలుసా?
- ట్విటర్లో పవన్ ఆగ్రహం
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష, సంస్కృతిని ఎలా కాపాడాలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి వైసీపీ నాయకత్వం నేర్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్త్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయిస్తే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు భాష విలువేంటో వైసీపీ నాయకత్వానికి తెలిస్తే ఇంత అర్థరహితమైన నిర్ణయం తీసుకోదన్నారు. ఈ నిర్ణయం చూశాక తన గ్రంథాలయంలోని తెలుగు పుస్తకాలను ప్రేమాభిమానాలతో ఒకసారి చూసుకున్నానని చెప్పారు. పెదబాలశిక్ష, తెలుగు వ్యాకరణం, శ్రీ సూర్యరాయేంద్ర నిఘంటువు, దేవరకొండ బాలగంగాధరతిలక్ సాహిత్యం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆంధ్రుల సాంఘిక జీవితచరిత్ర, శివారెడ్డి కవిత, 2017లో హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ రూపొందించిన ‘తొలిపొద్దు’ పుస్తకాన్ని పవన్ ట్విటర్లో పోస్టు చేశారు.