Home ఆంధ్ర ప్రదేశ్ ఇదేంటి బాస్‌!

ఇదేంటి బాస్‌!

కరెంటు బిల్లే రూ.25 వేలుఅన్ని శాఖలకు పెద్దన్నలాంటి ఒక శాఖ ఉన్నతాధికారికి నెలకు 25 వేలు కరెంటు బిల్లు వస్తోంది. ఆ అధికారి పగలంతా సచివాలయంలో ఉంటారు కానీ, ఆయన ఇల్లు కమర్షియల్‌ జోన్‌లో ఉంది. అందుకే ఇంత బిల్లు. ఈ బిల్లును ప్రజాధనం నుంచే చెల్లిస్తున్నారు. ఇంటి నిర్వహణ, వంట సరుకులు, కూరగాయలకు అవసరమయ్యే డబ్బులు కూడా రోజువారీగా లేదా అవసరాన్ని బట్టి రెండు మూడు రోజులకొకసారి నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇంట్లో పనివాళ్లకిచ్చే వేతనాలు కూడా ప్రజాధనం నుంచే! వాస్తవానికి ఒక్క సీఎ్‌సకే ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తారు. అయినా, సదరు అధికారికి ఆ కీలక శాఖకు అనుబంధంగా ఉన్న ఒక కార్పొరేషన్‌ నుంచి చెల్లింపులు చేస్తున్నారు. విజయవాడలో ఇల్లు, హైదరాబాద్‌లో మరో క్వార్టర్‌ను ఈ అధికారి వినియోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ఈ అధికారి వేరే శాఖకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు కూడా ఇదే రీతిలో ఇంటి ఖర్చులు పుచ్చుకొనేవారు. 

ఉందిగా సర్కారు..ప్రతినెల తమ సొంత ఆదాయం నుంచి కరెంటు బిల్లులు కడుతున్న ఐఏఎ్‌సలూ లేకపోలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం ఒక్కవాహనం, ఒక్క ఇల్లు మాత్రమే ఉన్న ఐఏఎ్‌సలున్నారు. కానీ, కొందరికి ఒక వాహనం సరిపోవడం లేదు. రెండోదీ కావాల్సిందే! అంతేనా.. మొదటి వాహనం ఎంత ఖరీదైందో రెండోదీ కూడా అంతే ఖరీదైనదిగా, విలాసవంతంగా ఉండాలి. ప్రభుత్వం వద్ద సిద్ధంగా లేకపోతే అద్దెకయినా తెచ్చివ్వాలి. కొందరు యువ ఐఏఎ్‌సల నుంచి సీనియర్‌ ఐఏఎ్‌సల దాకా ఇలాంటి విషయాల్లో ‘పట్టుదల’తో ఉంటున్నారు. నిజానికి, ఒక ఐఏఎ్‌సకి ప్రభుత్వం తరఫునుంచి ఒక్క వాహనమే కేటాయిస్తారు. రానురాను అది రెండుకు మారిందిగానీ, దానికి సంబంధించిన ఆదేశాలు మాత్రం లేవు. కానీ,మెజారిటీ అధికారులు వారి అర్హతలకు మించి ఇళ్లు, వాహనాలు, ఫోన్లు వాడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉందనేది ఐఏఎ్‌సలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. కనీసం ఐఏఎ్‌సల వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బిల్లులు చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉంది. బిల్లు కడితేనే డీజిల్‌ అని పెట్రోల్‌ బంకులు ఐఏఎ్‌సల కార్లు వెనక్కి పంపిన సంఘటనలున్నాయి. ఇవన్నీ తెలిసికూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని ఎడాపెడా వాడుకోవడం మాత్రం తగ్గడం లేదు. 

మర్యాద.. మర్యాద..ఒక ఐపీఎస్‌ అధికారి సెప్టెంబరు 30న రిటైరయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 3 అధికారిక వాహనాలు, ఏడుగురు సిబ్బందిని వాడుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఇలాంటి ఖర్చులతో ఒక్కో అధికారి నెలకు లక్షల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో వేతనాల ఖర్చు కంటే వీరి నిర్వహణవ్యయాలే ఖజానాకు గుదిబండలా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.