Home Uncategorized భవిష్యత్‌పై ఆశలను చంపేశారు

భవిష్యత్‌పై ఆశలను చంపేశారు

  • భూముల అమ్మకం తుగ్లక్‌ చర్య
  • సంపద చక్రాన్ని రివర్స్‌ చేశారు
  • అశాంతిని సృష్టించడమే వైసీపీ పాలసీ
  • టీడీపీ నేతల భేటీలో చంద్రబాబు ఫైర్‌

అమరావతి, నవంబరు 15: ‘‘ప్రజల్లో భవిష్యత్‌పై ఆశను చంపేశారు. ఏ రంగంలో చూసినా ముగింపు కనబడుతోంది. అవకాశం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. పెట్టుబడులు రాకుండా అంతా ధ్వంసం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా చేయడం ఎవరైనా చూశామా? ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వ భూముల అమ్మకం ఇంకో తుగ్గక్‌ చర్య. భూముల ధరలు పడిపోయేలా చేశారు. సీఎం జగన్‌కు ఆర్థిక రంగంపై అవగాహన లేదు. సొంత వసూళ్లే తప్ప సమాజంలో సంపద సృష్టించడం చేతకాదు’’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఏపీని టీడీపీ ప్రభుత్వం పెట్టుబడుల గమ్య స్థానం చేస్తే, 5 నెలల్లోనే పెట్టుబడులు, కంపెనీలు వెనక్కి పోయేలా వైసీపీ నేతలు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం రాజధాని, ఇరిగేషన్‌, నరేగాపై పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడం వల్ల రాబడి పెరిగి, ఎందరికో ఉపాధి ఏర్పడిందన్నారు. ఆ పనులన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఆపేసి, సంపద చక్రాన్ని రివర్స్‌ చేసిందన్నారు. రేపోమాపో కరెంటు చార్జీలు పెంచుతున్నారనీ, యూనిట్‌ రూ.11.40కు కొన్నట్లు అధికారులే చెప్తున్నారనీ తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్ల జీతాల పేరుతో పెద్ద ఎత్తున నిధులు మళ్లించారని ఆరోపించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను బెదిరించి, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడేలా చేశారు. ఆంగ్ల మాధ్యమం అంశంలో జగన్‌ ప్లేటు ఫిరాయించారంటూ వివరించారు. కులాలవారీగా చీల్చడం, ఆర్థికంగా బలహీన పర్చడం, విధ్వేషాలు రెచ్చగొట్టి అశాంతిని సృష్టించడం వైసీపీ పాలసీగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.