Home Uncategorized సమస్యల పరిష్కారానికే శత్రుత్వం

సమస్యల పరిష్కారానికే శత్రుత్వం

  • చేతులు కట్టుకుని కూర్చుంటే
  • తలపైకి ఎక్కి తైతక్కలాడతారు
  • 50 మందిని పొట్టనపెట్టుకుని
  • ఇసుక వారోత్సవాలా?.. సిగ్గుచేటు!
  • కార్మికుల కోసం ఆహార శిబిరాలు ఏర్పాటు
  • మంగళగిరిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి, నవంబరు 15: ‘‘నాకు ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం లేదు. శత్రువులు లేరు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం శత్రుత్వం పెట్టుకుంటాను. అలాంటి వారిని ప్రత్యర్థులుగా భావిస్తాను. ప్రజాస్వామ్యంలో మనకెందుకులే అని చేతులు కట్టుకొని కూర్చుంటే ఒక్కొక్కరూ తలపైకి ఎక్కి తైతక్కలాడుతారు. అలా తైతక్కలాడే వారిని తల మీద నుంచి దింపి నేలకేసి కొట్టాలి’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పించేందుకు జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మనుషులను చంపాలంటే గొడ్డలితో నరికి చంపాల్సిన అవవసరం లేదని, ఒక తప్పుడు విధానంతో కూడా ప్రాణాలు తీసే ఆస్కారం ఉందన్నారు. అదే కోవలో రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి 50 మంది కార్మికులను పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. పైగా ఇప్పుడు ఇసుక వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఇసుక విధానంపై గత ప్రభుత్వం చేసిన తప్పులను తాను బలంగా ఎండగట్టానన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాల్సిన ప్రస్తుత ప్రభుత్వం సుదీర్ఘకాలం ఇసుక సరఫరాను నిలిపివేసి రాష్ట్రంలో 35 లక్షల మంది కార్మికులను రోడ్డు పాల్జేసిందని ఆరోపించారు. గతంలో 1400 మంది చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర పేరుతో ప్ర తి ఒక్కరి ఇంటికీ వెళ్లిన నేతలు… నేడు 50 మంది కార్మికులు చనిపోతే వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని పవన్‌ ప్రశ్నించారు. కార్మికులకు నష్టపరిహారం ఇచ్చేందుకు మంగళగిరి ఎమ్మె ల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మనసు ఒప్పడం లేదా? అని ప్రశ్నించారు. రాజధానిపై అప్పుడేం చేశారు?‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని కోసం వేల ఎకరాలు సమీకరిస్తుంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏం చేసింది? ఆ రోజున మీరందరూ కూర్చొని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తేనే కదా అమరావతి వచ్చింది. ఆ తరువాతే కదా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసింది. చంద్రబాబు మీదో.. లేక ప్రధాని మీదో కోపంతో ఇప్పుడు రాజధానిని ఆపేస్తామంటే ఎలా? అమరావతి విషయంలో గత ప్రభుత్వ విధివిధానాలు నచ్చకపోతే వాటిలో మార్పులు చేర్పులు చేసి కొత్త విధివిధానాల ద్వారా రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలే తప్ప పూర్తిగా నిలిపివేయడం సరికాదు. కావాలంటే రాజధానిని పులివెందులలో పెట్టుకోండి. నేను కూడా వస్తాను. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. పులివెందులలో రాజధాని పెట్టుకుంటాను అం టే సంతోషమే! కానీ, ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతే తీర్మానం చేయండి’ అని పవన్‌ అన్నారు. ముఖ్యమంత్రిని జగన్‌రెడ్డి అంటే వైసీపీవాళ్లు బాధపడుతున్నారని, పోనీ అలా కాకుండా ఏమని పిలవాలో 151 మంది ఎమ్మెల్యేలూ తీర్మానం చేయాలని పవన్‌ సూచించారు. అవకాశం కాదు.. సిద్ధాంతమేఆ పార్టీలో ఇద్దరిని, ఈ పార్టీలో ఇద్దరని లాక్కొ ని రాజకీయాలు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒకవేళ ఎవరైనా పార్టీలోకి వచ్చినా జనసేన సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలని చెబుతామని, అవకాశవాదంతో పార్టీలోకి వచ్చిన వారు వెళ్లిపోయారని చెప్పారు. చనిపోయిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, ఐదు నెలలుగా ఉపాధి కోల్పోయిన ఒక్కో కార్మికుడికి నెలకు రూ.పది వేల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహార శిబిరాలుభవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి జనసేన నాయకులు శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో డొక్కా సీతమ్మ పే రిట ఆహార శిబిరాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం జి ల్లాలో ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో ఆహార శిబిరాలను ఏర్పాటు చేశా రు. ఒంగోలులో భవన నిర్మాణ కార్మికులకు అడ్డాగా పేరున్న ప్లైఓవర్‌ బ్రిడ్జి, కర్నూల్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద శిబిరాన్ని ఆపార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్‌ రియాజ్‌ ప్రారంభించారు.