Home Uncategorized హైకోర్టు వద్దంది.. సర్కారు రమ్మంది!

హైకోర్టు వద్దంది.. సర్కారు రమ్మంది!

  • సర్వీసు నుంచి తొలగించిన వ్యక్తికి దేవాదాయ ట్రైబ్యునల్‌ సారథ్యం

అమరావతి, నవంబరు 15 : ఆయన ఒకప్పుడు జడ్జిగా ఉండేవారు! ఆయన ‘ట్రాక్‌ రికార్డ్‌’ పరిశీలించిన హైకోర్టు… 55సంవత్సరాల వయసుకే నిర్బంధ పదవీ విరమణ ఇచ్చేసింది. ఇప్పుడు అదే వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచి పదవి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా గుత్తి ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా ఉన్న కె.వెంకట లక్ష్మి హరినాథ్‌ పని తీరును హైకోర్టు గతంలో సమీక్షించింది. ఆయన ట్రాక్‌ రికార్డు, ఇచ్చిన తీర్పులు, ఇతర అంశాలన్నింటినీ సమీక్షించింది. చివరికి. ఆయన జడ్జి స్థానంలో ఉండటం సరికాదని నిర్ణయించింది. 55 ఏళ్లకే రిటైర్‌మెంట్‌ ఇవ్వాలని ఫుల్‌కోర్టు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు 2019 జూన్‌ 30న హరినాథ్‌కు రిటైర్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పుడు… అదే హరినాథ్‌కు ప్రతిష్ఠాత్మకమైన దేవదాయశాఖ ట్రైబ్యునల్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. దేవదాయశాఖ భూములను ఆక్రమణదారుల చెరనుంచి విడిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది ట్రైబ్యునల్‌ చైర్మనే. ఇలాంటి కీలక పదవిని ట్రాక్‌ రికార్డు పరిశీలించి, జడ్జిగా సర్వీసులో కొనసాగే అర్హత లేదని హైకోర్టు నిర్ధారించిన వ్యక్తికే కట్టబెట్టారు.